Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

బంగారం ధర పైపైకి...

బంగారు.. ఎందుకీ కంగారు?

ఆర్థికమాంద్యం దెబ్బకు చుక్కలనంటుతున్న ధర*

త్వరలో రూ.40,000 మించిపోవచ్చు!

ఇప్పట్లో తగ్గే సంకేతాల్లేవు

ఆభరణాల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వినియోగదారులు

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేస్తోంది. ముచ్చటపడి కాసింత బంగారం కొనుక్కుందామంటే ధర చుక్కలనంటింది. పసిడి జోలికి వెళ్దామంటేనే భయపడిపోయే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం సంకేతాలతో పసిడి ధర పైపైకి ఎగబాకుతోంది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..., బంగారం ధర ఇప్పట్లో దిగివచ్చేటట్లు కనిపించకపోవటం! వచ్చే 4 నెలల పాటు పసిడి ధర పెరిగే అవకాశమే ఎక్కువ అని బంగారం వర్తకులు, నిపుణులు చెబుతున్న మాటలు వినియోగదారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తునన్నాయి. ఏదైనా ఉపద్రవం వస్తే విలువైన వస్తువును జాగ్రత్తగా దాచుకునే ప్రయత్నం చేస్తాం. అటువంటి వస్తువులకు ఆ సమయంలో గిరాకీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం విషయంలో అదే జరుగుతోంది! సామాన్య ప్రజలకు అందుబాటులో లేనంతగా దీని ధర ఎగబాకుతోంది.

 *ఎందుకిలా జరుగుతోంది?*

నాలుగేళ్లుగా 10 గ్రాముల బంగారం ధర కాస్త అటుఇటుగా రూ.33,000.
గత 3 నెలల్లోనే బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు 10 గ్రాముల ధర దాదాపు రూ.39,000.

ఇంత స్వల్ప కాలంలోనే ధర ఇంతగా పెరగడానికి కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ప్రస్తుతం వివిధ దేశాలు ఆర్థికంగా తీవ్రమైన అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. బంగారం ధర పెరుగుదలకు ఇదే ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ పరిణామాలే బంగారం ధరపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

పొగబెట్టిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం

అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ పట్టు తప్పటం ప్రారంభమైంది. అది పలు దేశాల్లో ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. ఆటోమొబైల్‌ రంగం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. భారత్‌, చైనా, జర్మనీ, మరికొన్ని ఐరోపా దేశాల్లో వాహనాల అమ్మకాలు క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా బాండ్ల మార్కెట్లలో ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. బాండ్లపై ప్రతిఫలం అనూహ్యంగా క్షీణించింది. అర్జెంటీనా కరెన్సీ ‘పెసో’ ఇటీవల కుప్పకూలిపోయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న ఆర్థికవేత్తలు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటం అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో వృద్ధిరేటు మందగించటం, ఉద్యోగాల్లో క్షీణత, నూతన పెట్టుబడులు లేకపోవటం, కొనుగోలు శక్తి తగ్గిపోవటం.. కళ్లముందు కనిపిస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో సహజంగానే భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి గిరాకీ ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గత ఆరేళ్ల గరిష్ఠస్థాయికి చేరింది. ట్రాయ్‌ ఔన్సు బంగారం(31.103 గ్రాములు) ఈ నెలలో ఒక దశలో 1550 డాలర్లు మించిపోయింది.

కొనేవాళ్లు తగ్గుతున్నారు....

బంగారం ధర చుక్కలనంటడంతో ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లు కొనేవారు తగ్గిపోతున్నారు. మునుపటిలాగా ఆభరణాల కొనుగోళ్లకు వినియోగదారులు తొందరపడటం లేదని హైదరాబాద్‌లోని జ్యూవెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కువకు పోకుండా తమ వద్ద ఉన్న సొమ్ముకు ఎంత బంగారం వస్తే అంతే కొంటున్నారని అంటున్నారు. ‘‘10 గ్రాముల ఆభరణం కొనటానికి వచ్చి, 8-9 గ్రాముల ఆభరణం తీసుకొని వెళ్తున్నారు. అంతకుమించి సొమ్ము వెచ్చించటం లేదు. కొనేవాళ్లు బాగా తగ్గారు. ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెడితే, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ఎక్కువ రావటం లేదు’’ అని సికింద్రాబాద్‌లోని ఓ అగ్రశ్రేణి జ్యూవెలరీ వర్తక సంస్థ ప్రతినిధి వివరించారు. వచ్చేది పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కాబట్టి అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు-నవంబరు నాటికి ధర ఇప్పటికంటే ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయన్నారు. ధర పెరుగుతుందనే ఆలోచనతో పాత బంగారం అమ్మేవాళ్లు కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు.

డిమాండు దక్షిణాదిలో ఎక్కువే..

బంగారానికి అధిక డిమాండ్‌ ఉన్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంటుంది. బంగారం దిగుమతిపై ప్రస్తుతం 12.5 శాతం కస్టమ్స్‌ సుంకం ఉంది. తర్వాత దానిపై 3 శాతం జీఎస్‌టీ, 0.5 శాతం హ్యాండ్లింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. మొత్తం కలిసి 16 శాతం అదనపు భారం ఉండటంతో ఇటీవల కాలంలో బంగారం స్మగ్లింగ్‌ బాగా పెరిగినట్లు దర్యాప్తు సంస్థల పరిశీలనలో తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బంగారంపై ప్రజలకు మక్కువ ఎక్కువ. డిమాండూ ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం ధర బాగా పెరిగి, ఇంకా పెరుగుతుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో తమ ఇష్టానికి తగ్గట్లుగా ఆభరణాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెళ్లిళ్లు, లేదా ఇంకేమైనా అవసరం ఉన్న వారు, ధర తగ్గుతుందేమోనని కొద్దిరోజులు ఎదురుచూసి ఇక తప్పనిసరై ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. అంతగా తొందర లేని వారు మాత్రం తమ కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు.

ధర తగ్గేటట్లు కనిపించటం లేదు. అన్ని సంకేతాలూ పెరుగుదల వైపే ఉన్నాయి. దేశీయ మార్కెట్లో వచ్చే నాలుగైదు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.40,000ను మించిపోవచ్చు. రూ.42,500 వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు.

హైదరాబాద్‌లోని ఓ అగ్రశ్రేణి బులియన్‌ వర్తక సంస్థ డైరెక్టర్‌ అభిప్రాయం.

మరి కొంతకాలం ధర పైపైకే...

బంగారం ధర సమీప భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా చూస్తే.., ఈ సంవత్సరాంతం నాటికే ఔన్సు బంగారం ధర 1830 డాలర్ల వరకూ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఇంకా పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని విశ్లేషిస్తున్నారు. అంటే రాబోయే ఏడాది కాలం పాటు బంగారం ధర పెరగటమే కానీ తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. దీన్నే మరో రకంగా విశ్లేషిస్తే... ప్రస్తుత మాంద్య పరిస్థితుల ప్రభావం మరో ఏడాది పాటు ఉండొచ్చనే అభిప్రాయానికి రావచ్చు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND