Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

CHANDRAYAN - 2 --చంద్రుడిపై విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌

చంద్రుడిపై విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌
ఆర్బిటర్‌ ద్వారా థర్మల్‌ ఇమేజ్‌లు చిత్రీకరించాం
ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ప్రకటన
భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న నాసా

బెంగళూరు/వాషింగ్టన్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్‌ కె.శివన్‌ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన 'విక్రమ్‌' ల్యాండర్‌ను గుర్తించామని తెలిపారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు 'విక్రమ్‌'కు సంబంధించిన థర్మల్‌ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఈ చిత్రాలను చూస్తే విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ అయినట్లు (చంద్రుడిపై పడిపోయినట్లు) అనిపిస్తోందని వ్యా ఖ్యానించారు.

బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ కేంద్రంలో శివన్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విక్రమ్‌ ల్యాండర్‌ దెబ్బతిందా? అన్న మీడియా ప్రశ్నకు..'ఆ విషయంలో మాకు స్పష్టత లేదు. ల్యాండర్‌ లోపలే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఉంది' అని జవాబిచ్చారు. ఇస్రో ఈ ఏడాది జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి.
సమయం మించిపోతోంది..
చంద్రయాన్‌-2లో భాగంగా ప్రయోగించిన 'విక్రమ్‌' ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు సమయం మించిపోతోందని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 'ల్యాండర్‌ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో ఆలస్యమయ్యేకొద్దీ విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ వ్యవస్థల్ని పునరుద్ధరించడం కష్టమైపోతుంది. ఇప్పటికైనా ల్యాండర్‌ సరైన దిశలో ఉంటే సోలార్‌ ప్యానెల్స్‌ సాయంతో చార్జింగ్‌ చేసుకోగలదు.
అయితే ఇది జరిగే అవకాశాలున్నట్లు కనిపించడం లేదు' అని వ్యాఖ్యానించారు. చంద్రుడిపై సురక్షితంగా దిగేలా విక్రమ్‌ను రూపొందించామనీ, అయితే జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా తాకడం కారణంగా ల్యాండర్‌ దెబ్బతిని ఉండొచ్చని మరో ఇస్రో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ కోసం రూ.375 కోట్లు, ఆర్బిటర్‌-ల్యాండర్‌-రోవర్‌ కోసం రూ.603 కోట్లు వెచ్చించింది. మరోవైపు విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు శివన్‌ తెలిపారు. ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్‌లో 8 సాంకేతిక పరికరాలు ఉన్నాయనీ, ఇవి చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్‌ చేయడంతో పాటు బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయని వెల్లడించారు.
దేశ ప్రజలకు ఇస్రో కృతజ్ఞతలు..
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో ఒడిదుడుకులు ఎదురైనా ప్రధాని మోదీతో పాటు యావత్‌ భారతం తమవెంట నిలవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై శివన్‌ మాట్లాడుతూ..'ప్రధాని మోదీతో పాటు దేశమంతా మాకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చర్య శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచింది' అని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ స్పందిస్తూ..'భారత ప్రజలు చూపిన సానుకూల దృక్పథంతో మేం కదిలిపోయాం. ఇస్రో చైర్మన్‌ శివన్, ఇతర శాస్త్రవేత్తల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే విషయంలో ప్రధాని గొప్పగా ప్రవర్తించారు' అని వ్యాఖ్యానించారు. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో ప్రజలు గుర్తించి తమకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని ఇస్రోకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. ఇందుకోసం తాము దేశానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
'ఇస్రో'పై అమెరికా ప్రశంసలు..
ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రశంసలు కురిపించింది. ఈ ప్రయోగంతో తాము స్ఫూర్తి పొందామనీ, ఇస్రోతో కలిసి సౌర వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. ఈ విషయమై నాసా స్పందిస్తూ.. 'అంతరిక్ష ప్రయోగాలు అన్నవి చాలా సంక్లిష్టమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2ను స్వాగతిస్తున్నాం' అని తెలిపింది.
ఇస్రో చేపట్టిన ప్రయోగం అద్భుతమనీ, దీనివల్ల శాస్త్రీయ పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేసింది. చంద్రుడిపై దిగే తొలిప్రయత్నంలో ఇండియా విజయవంతం కాకపోయినా భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యం, సామర్థ్యం ఏంటో చంద్రయాన్‌-2తో ప్రపంచం మొత్తానికి తెలిసిందని ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రశంసించింది. అమెరికా చేపట్టిన 'అపోలో మిషన్‌'తో పోల్చుకుంటే ఎంతో చవకగా కేవలం 141 మిలియన్‌ డాలర్ల వ్యయంతోనే భారత్‌ చంద్రయాన్‌-2 చేపట్టిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ వ్యాఖ్యానించింది.
Source : Sakshi 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND