ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులే
రాష్ట్రంలో నవంబరు రెండో తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఒక్కో గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా ఉండకుండా జాగత్త్రలు తీసుకోవాలని వివరించింది. ‘‘ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా మాస్కు, నీళ్ల సీసా ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి. విద్యార్థులందరికీ ఒకేసారి మధ్యాహ్న భోజన విరామం ఇవ్వకూడదు. మాస్కు ధరిస్తేనే ఎవరినైనా పాఠశాలల్లోకి అనుమతించాలి. వీరందరికీ తప్పనిసరిగా థర్మల్ స్కానింగ్ చేయాలి. ప్రార్థన సమావేశాలు తరగతి గదిలోనే నిర్వహించాలి. కొవిడ్-19 జాగ్రత్తలపై ప్రతిజ్ఞ చేయించాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశంలోనే బోధన నిర్వహించాలి. నవంబరు ఒకటో తేదీన తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయుడు సమావేశం నిర్వహించాలి’’ అని మార్గదర్శకాల్లో పేర్కొంది.
No comments:
Post a Comment