ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారా ?
మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవీ
గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించి మీరు ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలు చేశారా? అయితే మీరు కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే.. మీ రిటర్ను ప్రాసెస్ అవగానే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఐటీ చట్టంలోని 143(1) కింద ఆదాయ పన్ను విభాగం నుంచి మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు ఇంటిమేషన్ వస్తుంది. దీనిలో ఎంతో ముఖ్యమైన సమాచారం ఉంటుంది. దీని సాయంతోనే మీరు రిఫండ్/డిమాండ్ స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. మీ ఆదాయ వివరాలు, మీరు క్లెయిమ్ చేసిన డిడక్షన్లు, పన్ను లెక్కలతోపాటు ఇవన్నీ పన్ను విభాగ అంచనాలు, లెక్కలతో సరిపోలుతున్నాయా లేదా అన్న వివరాలు ఈ ఇంటిమేషన్‌లో ఉంటాయి. పన్ను చెల్లింపుదారునిగా ఈ సమాచారాన్నంతటినీ క్షుణ్ణంగా చదువుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. మీ టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్), అడ్వాన్స్ ట్యాక్స్, ఫారిన్ క్రెడిట్ ట్యాక్స్, సెల్ఫ్-అసెస్‌మెంట్ ట్యాక్స్ చెల్లింపులను క్రెడిట్ చేసేందుకు అనుమతించాక మీరు ఇంకా ఏమైనా పన్ను చెల్లించాల్సి వచ్చినా లేక మీకేమైనా రిఫండ్ రావాల్సి ఉన్నా ఆ వివరాలన్నీ ఈ ఇంటిమేషన్‌లో ఉంటాయి.
అడిషనల్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్
పన్ను విభాగ అంచనా ప్రకారం.. మీరు ఏదైనా ఓ ప్రత్యేక ఆదాయ వివరాన్ని రిటర్నులో పొందుపర్చకపోయినా, అక్రమంగా డిడక్షన్ క్లెయిమ్ చేసినా, పన్నును సరిగా లెక్కించకపోయినా మీరు అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్ డిమాండ్ రూపంలో నోటీసు చివర్లో దీన్ని ప్రదర్శిస్తారు.*
ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్
వాస్తవంగా చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ చెల్లించినట్లయితే ఆ సొమ్మును మీకు తిరిగి చెల్లిస్తారు. దీన్నే పన్ను రిఫండ్ అంటారు.
ఇంటిమేషన్ నోటీసును ఎలా చదవాలంటే..
సాధారణంగా ఇంటిమేషన్ నోటీసు.. పాస్‌వర్డ్ రక్షణతో కూడిన ఫైల్ రూపంలో ఉంటుంది. మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ నంబర్)తోపాటు మీ పుట్టిన తేదీ మీ పాస్‌వర్డ్‌గా ఉంటుంది. దీన్ని లోయర్ కేస్‌లో ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీ పాన్ నంబర్ ‘AAAAA00000A’గా, పుట్టిన తేదీ 01-01-1999గా ఉంటే.. అప్పుడు డాక్యుమెంట్‌ను తెరిచేందుకు ‘aaaaa 00000a01011 999’ అనే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్‌లో మీ పేరు, చిరునామా, పాన్ నంబర్ లాంటి వ్యక్తిగత వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అనంతరం డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చదవాలి. ఐటీఆర్‌లో మీరు పొందుపర్చిన ఆదాయ పన్ను లెక్కలు.. ఐటీ విభాగ లెక్కలతో సరిపోలాయో లేదో పరిశీలించాలి. ఐటీఆర్‌లో మీరు చూపిన ఆదాయాన్ని ఓ కాలమ్‌లో.. ఐటీ విభాగం లెక్కించిన ఆదాయాన్ని పక్క కాలమ్‌లో పొందుపర్చి ఈ రెండింటినీ పోలుస్తూ ఇంటిమేషన్ నోటీసులో ఓ పట్టికను ప్రదర్శిస్తారు. ఈ వివరాలతోపాటు ఐటీఆర్‌లో మీరు క్లెయిమ్ చేసిన ట్యాక్స్ సేవింగ్ డిడక్షన్ల వివరాలు కూడా ఇంటిమేషన్ నోటీసులో ఉంటాయి.
No comments:
Post a Comment