నేడు టీచర్ల బదిలీ ఉత్తర్వులు జారీ..
సంక్రాంతి సెలవులు తరువాత నూతన స్థానాల్లో విధులు..
టీచర్ల బదిలీల ఉత్తర్వులు బుధవారం జారీ కానున్నాయి. కోర్టును ఆశ్రయించినా గ్రేడ్ - 2 హెచ్ఎంలు (జిల్లా పరిషత్), స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ మినహా మిగతా అన్ని క్యాడర్ల టీచర్ల బదిలీలు తుది దశకు చేరుకున్నాయి. తొలుత బుధవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసి, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించేందుకు కొన్ని రోజులు గడువు ఇస్తారు. ఖరారైన బదిలీ స్థానాలపై సాంకేతికంగా ఏమైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తారు. జిల్లాలో మొత్తం 5699 మంది హెచ్ఎంలు, టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకే స్కూలులో ఐదేళ్లు పనిచేసిన గ్రేడ్-2 హెచ్ ఎంలు, ఎనిమిదేళ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నిబంధన కింద స్థాన చలనం ఉంటుంది. ఇటువంటి ప్రధానోపాధ్యాయులు, టీచర్లు జిల్లాలో 1905 మంది ఉన్నారు. వీరంతా సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన రోజునే నూతన బదిలీ స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
కోర్టు మెట్లు ఎక్కనున్న టీచర్లు ?
ఒకే చోట ఐదేళ్ళ కాలపరిమితి ప్రామాణికతపై గ్రేడ్-2 హెచ్ఎంలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో హెచ్ఎంల బదిలీల ప్రక్రియకు ప్రస్తుతానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ కోవలో జిల్లాలో 121 మంది హెచ్ఎంలు (జడ్పీ) తాజాగా బదిలీ స్థానాలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా, ఆ మేరకు విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక కొత్త గా అప్ గ్రేడేషన్ చేసిన పాఠశాలల వేకెన్సీలను సాధారణ బదిలీల్లో చేర్చాలని అభ్యర్థిస్తూ స్కూలు అసిస్టెంట్ క్యాడర్ తెలుగు, హిందీ ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులను పొందారు జిల్లాకు చెందిన సంబంధిత టీచర్లలో కొందరు కూడా అదే డిమాండ్ తో న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.అదే జరిగితే ఈ రెండు సబ్జెక్టులకు కొత్తగా సుమారు 600లు అప్ గ్రేడేషన్ వేకెన్సీలను బదిలీలకు చేర్చాల్సి రావడం, ఆ మేరకు ఇప్పటికే వెబ్ ఆప్షన్లు ఇచ్చిన టీచర్లు అందరికీ మళ్లీ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేడ్ -2 హెచ్ఎంలు, స్కూలు అసిస్టెంట్ తెలుగు, హిందీ టీచర్ల బదిలీ ఉత్తర్వులు మినహా మిగతా బదిలీలన్నింటికీ ఆర్డర్లు బుధవారం జారీ అయ్యే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment