గ్రామాలు విలీనమైనా ప్రత్యేక ఉత్తర్వులివ్వకపోతే టీచర్లు విలీనం కారు : హైకోర్టు తీర్పు
గ్రామాలను మున్సిపాల్టీలు/ మున్సిపల్ కార్పొరేషన్లు/ నగర పంచాయతీల్లో విలీనం చేసిన తర్వాత సదరు గ్రామాల్లో పనిచేసే టీచర్లు వాటిలో విలీనమైనట్లు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టీచర్లు జీతభత్యాలను విద్యాశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖల నుంచి తీసుకుంటున్నప్పుడు వారంతా మున్సిపాల్టీలు/ మున్సిపల్ కార్పొరేషన్లు/ నగర పంచాయతీల టీచర్లు అవ్వబోరని స్పష్టం చేసింది. మున్సిపాల్టీలు/ మున్సిపల్ కార్పొరేషన్లు/ నగర పంచాయతీలకు చెందిన టీచర్లని ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిస్తేనే అవుతుందని పేర్కొంది. ఈ విధం కానప్పుడు గ్రామాలు విలీనమైనా వారు విలీనమైనట్లు కాదని వివరించింది. తాము పనిచేసే గ్రామాలు మున్సిపాల్టీల్లో విలీనమైనందున తమను కూడా మున్సిపాల్టీలో విలీనం చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని పలువురు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. టీచర్లను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోతే వారంతా మాతృ శాఖలో ఉన్నట్లేనని చెప్పింది. టీచర్ల బదిలీలకు 2020 అక్టోబర్ 12న ప్రభుత్వం జీవో 54 జారీ చేసింది. గ్రామాల విలీనం నేపథ్యంలో తమ సర్వీసులు కూడా మున్సిపాల్టీలు/ మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీల్లోకి మారినట్లుగా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను కొట్టేసింది. తమను విలీనం చేయకపోవడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలన్న వాదనను తోసిపుచ్చింది. పంచాయతీరాజ్, విద్యాశాఖల్లో పనిచేస్తూ ఆయా శాఖల నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు జీవో 54 ప్రకారం వారందరినీ ప్రభుత్వం బదిలీలు చేయవచ్చునని స్పష్టం చేసింది.
No comments:
Post a Comment