- మనకెప్పుడు పీఆర్సీ ?
- ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇదే చర్చ
- సీఎస్ చేతికి ఇప్పటికే పీఆర్సీ నివేదిక
- విభజన కష్టాల్లోనే 43% ఫిట్‌మెంట్
- 10వ పీఆర్సీలో అమలు చేసిన టీడీపీ
- ఇప్పుడు 55% ఇవ్వాలన్న సంఘాలు
- కాంట్రాక్టు ఉద్యోగులకూ పీఆర్సీ లబ్ధి,
- వయసు పెంపుపైనా డిమాండ్లు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేశారు. వచ్చే నెల నుంచే అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచారు. దీంతో ‘మనకెప్పుడు పీఆర్సీ’ అనే చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో మొదలైంది. వేతన సవరణ కమిషన్ కసరత్తు అప్పుడెప్పుడో పూర్తయినా.. ఇప్పటికీ విషయం తేలడం లేదు. ఇప్పుడు.. తెలంగాణలో పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో పదకొండవ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫారసులకు మోక్షమెప్పుడని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంతో, ఏ నలుగురు ఉద్యోగులు కలిసినా ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్! ఆరు వాయిదాల తర్వాత పీఆర్సీ చైర్మన్ అశుతోష్ మిశ్రా గత ఏడాది తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించారు. 11వ పీఆర్సీ కోసం టీడీపీ ప్రభుత్వం 2018 మే నెలలో పీఆర్సీని వేసింది. అప్పటికే 10వ పీఆర్సీ సిఫారసులను అమలుచేసింది.
రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్ కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఉద్యోగులకు 10 నెలల బకాయిలు చెల్లించి రికార్డు సృష్టించారు. 11వ పీఆర్సీ విషయం వచ్చేసరికి.. ఏడాది లోపు నివేదిక ఇవ్వాల్సి ఉండగా... ఆరు దఫాలు వాయిదా రెండేళ్ల అనంతరం నివేదిక ఇచ్చేసరికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ 27 శాతం ప్రకటించడంతో వాస్తవానికి పీఆర్సీ నివేదిక గురించి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు దాదాపు మరచిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు పీఆర్సీ ఇవ్వకపోతారా అనే భావనే కనిపించేది. తన ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తిరిగి పీఆర్సీపైకి ఉద్యోగుల ఆసక్తిని మళ్లించింది. రాష్ట్ర విభజన కష్ట కాలంలోనే 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని.. ఇప్పుడు కనీసం 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాలు కోరాయి.
పీఆర్సీ కమిషన్‌కు ఇదే విషయం నివేదించాయి. 2018 జూలై నుంచి పీఆర్సీ రావాల్సి ఉంది. అంటే 27 నెలల బకాయిలు. గత ప్రభుత్వం అప్పట్లో బకాయిలు చెల్లించడంతో...ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా 27 నెలల బకాయిలు చెల్లిస్తుందని ఆశతో నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు, అంతే సంఖ్యలో ఉన్న విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎన్ని ఐఆర్‌లు ఇచ్చినా పీఆర్సీకి సాటి కావని ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అందరికీ పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఈ నిర్ణయం సహజంగానే ఆశలు రేపింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ విషయమై గట్టిగా కోరే అవకాశముంది. అలాగే, ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సు 61 ఏళ్లకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్‌ను కోరే ఉద్యోగులు కూడా లేకపోలేదు.
No comments:
Post a Comment