- పాఠశాల పనుల పరిశీలన బాధ్యత పొదుపు మహిళలకు
- మేలో రైతు భరోసా, మత్స్యకార భరోసా, పంటల బీమా
- స్పందన సమీక్షలో సీఎం జగన్
➧పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ తొలిదశ పనుల్ని స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసాతోపాటు సున్నా వడ్డీల జమ తేదీలను సీఎం ప్రకటించారు.
➧పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ తొలిదశ పనుల్ని స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి చేసిన బడులకు వెంటనే రంగులు వేయించి, వాటిని ఏప్రిల్ ఆఖరున ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమం అమలుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. 17,715 పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా.. తృతీయపక్షం ద్వారా క్షేత్రస్థాయిలో పనుల్ని ఆడిటింగ్ చేయించాలని సూచించారు. ‘ఏప్రిల్ 1 నుంచి అర్బన్ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలి. గ్రామ/వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని ప్రక్రియను ఉద్ధృతంగా చేపట్టాలి. గురువారం నేనూ టీకా తీసుకుంటున్నా’ అని తెలిపారు. ‘ఏపీ చిన్న రాష్ట్రమైనా.. ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలోనే మూడోస్థానంలో ఉండటం గర్వకారణం. రూ.5,818 కోట్లను కూలీలకు ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్‌లో పనులు ముమ్మరంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. దీనిపై కలెక్టర్లు నాలుగైదు రోజులకోసారి సమీక్షించాలి’ అని సీఎం ఆదేశించారు.
పథకాల అమలు తేదీల ప్రకటన
రైతు భరోసాతోపాటు సున్నా వడ్డీల జమ తేదీలను సీఎం ప్రకటించారు. సంబంధిత సమాచారాన్ని బ్యాంకర్ల ద్వారా అప్‌లోడ్ చేయించేలా కలెక్టర్లు చూడాలని చెప్పారు. ఏప్రిల్ 13న వాలంటీర్లను సత్కరించనున్నట్లు వివరించారు. చేయూత పథకం కింద జూన్‌లో మహిళలకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. మహిళలకు పాలవెల్లువ, జీవక్రాంతి యూనిట్లను ఏప్రిల్ 10లోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 25 ఆహారశుద్ధి యూనిట్లను పెట్టబోతున్నట్లు చెప్పారు.
భవనాల్ని త్వరగా పూర్తిచేయాలి
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజి క్లినిక్‌ల భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ‘వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా జులై 8న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తాం. కొవిడ్ తరహా మహమ్మారుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా చేపట్టిన విలేజి క్లినిక్‌లను ఆగస్టు 15న ప్రారంభించాలి’ అని నిర్దేశించారు. ‘9,899 చోట్ల బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 3,841 చోట్ల పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల వెంటనే ప్రారంభించాలి’ అని సూచించారు. ‘రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా మార్చబోతున్నాం. ఇక్కడ ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటుంది. 16,681 చోట్ల నాడు-నేడు కింద అభివృద్ధి పనులు, 27,438 చోట్ల కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలి. 11,488 అంగన్‌వాడీల్లో నాడు-నేడు పనుల్ని ఏప్రిల్ మూడో వారంలో విద్యాశాఖ చేపడుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.
సరసమైన ధరలకు ఇళ్లస్థలాలు
మధ్యతరగతి ప్రజలకు(ఎంఐజీ).. సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు వీలుగా పట్టణాలు, నగరాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘జగనన్న కాలనీల్లో.. ఒక్కో కాలనీకి ఒకటి చొప్పున నమూనా ఇళ్లను ఏప్రిల్ 15 కల్లా కట్టాలి. 8,682 కాలనీల్లో.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్, జియోట్యాగింగ్ ఇతర సన్నాహక పనులన్నింటినీ ఏప్రిల్ 10కి పూర్తి చేయాలి’ అని చెప్పారు.
స్పందన గడువు పెంచుతున్నాం
540 సేవలకు సంబంధించి స్పందన కింద స్వీకరించే అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. ‘బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డులను 21 రోజులు, ఇంటి పట్టాను 90 రోజుల్లో అందించాలి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి. నిర్ణీత సమయంలో దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయా? అనే అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రతి గురువారమూ సమీక్షించాలి’ అని సూచించారు.
➧సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పూనం మాలకొండయ్య, వై.శ్రీలక్ష్మి, అజయ్‌జైన్, ఏఆర్ అనూరాధ, బుడితి రాజశేఖర్, కమిషనర్లు గిరిజాశంకర్, కోన శశిధర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున తదితరులు హాజరయ్యారు.
No comments:
Post a Comment