PM Modi: 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా..
దిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక అస్త్రమైన వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇటీవల చేసిన వ్యాక్సినేషన్ విధానంలో కొత్త మార్పులు చేసింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని.. రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు. వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడానన్న ప్రధాని.. టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. సెకండ్ వేవ్ కంటే ముందే ఫ్రంట్‌లైన్ యోధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు మోదీ తన ప్రసంగంలో తెలిపారు.
నవంబర్ నాటికి 80శాతం మందికి వ్యాక్సినేషన్..
‘‘ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియ చేపట్టి నవంబర్ నాటికి 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం. సొంత ఖర్చుతో టీకా వేసుకొని వారికి ప్రైవేటులో అవకాశం ఉంటుంది. టీకాల్లో 25శాతం ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంటాయి. గరిష్ఠంగా రూ.150 సర్వీస్ ఛార్జితో ప్రైవేటులోనూ టీకా వేసుకోవచ్చు’’
ఆక్సిజన్ ఉత్పత్తి 10రెట్లు పెంచాం..
‘‘ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆధునిక కాలంలో ఇలాంటి ఈ తరహా మహమ్మారిని ఎప్పుడూ చూడలేదు. కరోనా సెకండ్ వేవ్‌తో దేశం కఠిన పోరాటం చేస్తోంది. కరోనా వల్ల ఎంతోమంది ఆప్తులను కోల్పోయారు. గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి. ఇలాంటి మహమ్మారిని గతంలో చూడలేదు.. వినలేదు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగింది. తక్కువ సమయంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచాం. ఆక్సిజన్ సరఫరాకు వైమానిక, నౌకా, రైల్వే సేవలు వినియోగించుకున్నాం. కరోనాపై పోరులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాల బాధను పంచుకుంటున్నా. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు బాగా పెంచాం’’
అదృశ్య శక్తితో పోరాటంలో ఇదే మనకు రక్ష ..
‘కరోనా వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయి. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కొవిడ్ ప్రొటోకాల్ పాటించడమే మనకు రక్ష. ఇంతమంది జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్ తయారు చేసుకోకుంటే పరిస్థితి ఏమిటి? మనం వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే విదేశాల నుంచి వచ్చేందుకు ఏళ్లు పట్టేది. గతంలో టీకాల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. మిషన్ ఇంద్ర ధనస్సు ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రారంభించాం. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డాం. మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్ తయారుచేశారు. ఇప్పటివరకు 23కోట్ల డోసులు పంపిణీ చేశాం. తక్కువ సమయంలో టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు.
కొద్ది రోజుల్లోనే టీకా ఉత్పత్తి మరింత వేగవంతం..
టీకా తయారీలో అన్ని విధాలుగా కేంద్రం మద్దతిచ్చింది. టీకా తయారీ సంస్థలు, క్లినికల్ ట్రయల్స్‌కు పూర్తి మద్దతుగా నిలిచాం. కేంద్రం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయి. దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయి. మరో మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాసల్ స్పే టీకా కోసం కూడా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనం ఎవరి కంటే వెనుకబడిలేం. కొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుంది’’ అని మోదీ వివరించారు.
No comments:
Post a Comment