Whatsapp లో ఒకసారి మెసేజ్ చూడగానే ఇక డిలీట్ !
వాట్సాప్ ( Whatsapp ) వాడని స్మార్ట్‌ఫోన్ యూజర్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు ! అంతలా మనతో మమేకమైపోయిందీ మెసెంజర్ యాప్ !! అందుకే వాట్సాప్ కూడా యూజర్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌ను తీసుకొస్తుంది. ఇప్పటికే పలు అప్‌డేట్స్ తీసుకొచ్చిన వాట్సాప్.. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం..
డిసప్పియరింగ్ మోడ్
వాట్సాప్‌లో ఇప్పటికే డిసప్పియరింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. గత ఏడాదే వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. కాకపోతే ఈ ఫీచర్‌ను ఒక్కో చాట్‌కు ప్రత్యేకంగా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఇప్పుడు మరింత అప్‌డేట్ చేసిన సంస్థ డిసప్పియరింగ్ మోడ్‌గా తీసుకొస్తుంది. ఈ మోడ్ ఆన్ చేస్తే.. అన్ని వాట్సాప్ చాట్‌లకు ఒకేసారి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.
మెసేజ్ ఒకసారి చూడగానే డిలీట్
యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది అదే.. వ్యూ వన్స్ ఫీచర్ ! ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే.. మీరు పంపిన ఫొటో లేదా వీడియోను అవతలి వ్యక్తి కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలరు. రిసీవర్ ఒకసారి మీరు పంపిన ఫొటో లేదా వీడియోను ఓపెన్ చేయగానే అది ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే తరహాలో డిసప్పియరింగ్ ఫొటో లేదా వీడియో ఫీచర్ ఉంది.
ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో
ఇప్పటివరకు వాట్సాప్‌ను ఒక నంబర్‌తో కేవలం ఒక్క డివైజ్‌లో మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌తో ఒకే నంబర్‌తో వాట్సాప్‌ను నాలుగు డివైజ్‌ల్లో ఉపయోగించుకోవచ్చు. వచ్చే రెండు నెలల్లో పబ్లిక్ బీటా వర్షన్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఈ ఫీచర్ తీసుకొచ్చినంత మాత్రాన వ్యక్తిగత చాట్‌లకు సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని వాట్సాప్ స్పష్టం చేసింది.
మిస్స్‌డ్ గ్రూప్ కాల్స్
వాట్సాప్‌లో మనకు వచ్చిన గ్రూప్ కాల్ అటెండ్ చేయలేకపోయినా.. మధ్యలో డిస్‌కనెక్ట్ అయినా తిరిగి ఆ కాల్‌లో చేరే అవకాశం లేదు. కానీ ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో ఆ ఇబ్బంది ఉండదు. గ్రూప్ కాల్ అటెండ్ చేయడం కుదరకపోయినా.. లేదా మధ్యలో డిస్‌కనెక్ట్ అయినా కాల్‌లో ఉన్న ఎవరో ఒకరు పంపిన ఇన్విటేషన్ ద్వారా గ్రూప్ కాల్‌లో జాయిన్ కావచ్చు. ఈ సదుపాయాన్ని ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌లో అక్టోబర్ 2020లోనే వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఐఓఎస్ యూజర్ల కోసం కూడా ఈ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది.
వాట్సాప్ రీడ్ లాటర్
ప్రస్తుతం ఉన్న ఆర్కీవ్ చాట్‌ను అప్‌డేట్ చేసి ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు ఫీచర్ ప్రకారం.. ఏదైనా వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌ను ఆర్కీవ్ చేస్తే ఆ చాట్ కిందకు వెళ్లిపోయేది. కానీ మళ్లీ ఏదైనా కొత్త మెసేజ్ రాగానే ఆ చాట్ పైకి వచ్చేసేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌గా తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో ఒకసారి ఆర్కీవ్ చేస్తే ఆ చాట్ మళ్లీ మనకు కనిపించదు. ఒక్కసారి ఆర్కీవ్ చేస్తే ఆ తర్వాత ఎన్ని మెసేజ్‌లు వచ్చినా వాటిని పర్మినెంట్‌గా మ్యూట్ చేస్తుంది. మళ్లీ మనం ఆర్కీవ్ చాట్ సెక్షన్‌లోకి వెళ్తేనే వాటిని చూసుకోగలం.
No comments:
Post a Comment