AP : పీఆర్సీ విధి, విధానాలు.... ఇప్పటి వరకు అమలు చేసిన PRC ల వివరాలు...
ప్రతి ఐదేళ్లకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతుంది. పీఆర్‌సీ సమయంలో ఫిట్‌మెంట్, ఐఆర్ , ప్రారంభ డీఏ, నోషన్ ఫిక్సేషన్ తదితర పదాలు వినిపిస్తాయి. 2018 జూలై ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నూతన వేతనాలు అమలు చేయడానికి 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పీఆర్సీ :
పీఆర్‌సీని ఆంగ్లంలో పే రివిజన్ కమిటీ (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేత నాలుగా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్ స్కేలు, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయం గా తాజా మూల వేతానాలను ప్రతిపాదిస్తుంది.
మధ్యంతర భృతి(ఐఆర్) :
ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్ రద్దవుతుంది.
ఫిట్‌మెంట్ :
తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితిశాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్ అంటారు.
మాస్టర్ స్కేల్ :
మూత వేతనాల శ్రేణినే మాస్టర్ స్కేల్ అంటారు. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారు. కొత్త మూల వేతనాలు, మాస్టర్ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు. మాస్టర్ స్కేల్‌లో మూల వేతనాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్ విలువలు పొందు పరుస్తారు. వేతన స్థిరీకరణలను మాస్టర్ స్కేల్ ప్రకారం జరుపుతారు._
నోషనల్ ఫిక్సేషన్ :
పీఆర్‌సీ అమలైన తేదీ నుంచి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నోషనల్ పిరియడ్ అంటారు. ఈ పీరియడ్‌లో జరిగే స్థిరీకరణనే నోషనల్ ఫిక్సేషన్ అంటారు. ప్రభుత్వం పీఆర్‌సీని సకాలంలో జరపకపోవడం వల్ల నోషనల్ పిరియడ్ వస్తుంది. నోషనల్ కాలంలో పెరిగిన వేతనాలను ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాడ్యూటీ, పెరిగిన మూల వేతనాలకు చెల్లించరు. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు.
నైష్పత్తిక డీఏ :
ప్రతీ పీఆర్‌సీలో డీఏ విలువను మార్పు చేస్తారు. కేంద్రం ప్రకటించే ప్రతి ఒక్క శాతం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏను నైష్పత్తిక డీఏ అంటారు.
రెండు పి.ఆర్.సి ల కాలం ఆలస్యం
- సకాలంలో అమలు కాని వేతన సవరణలు
- 11వ వేతన సవరణ కమిషన్ కు మళ్లీ గడువు పెంపు
- ఉద్యోగుల్లో చర్చోపచర్చలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు 11వ వేతన సవరణ నివేదిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతోంది. మరోసారి వేతన సవరణ కమిషన్ గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేవలం మరో 15 రోజులు మాత్రమే గడువు పెంచారు. ఈ లోపు కమిషన్ తన నివేదికను సమర్పిస్తుందా అన్నది సందేహమే. అసలే కరోనా కాలం కావడంతో రాష్ర్ట ఆదాయాలు తగ్గి ఉద్యోగ సంఘాలు సైతం గట్టిగా ఒత్తిడి చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో ఉద్యోగుల్లో పీఆర్సీల పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉద్యమాల వల్ల పీఆర్సీ కమిషన్ల నియామకం జరిగినా వాటి నివేదికల సమర్పణ, అమలు ఆలస్యమవుతూ వస్తోంది.. ఇంతవరకు ఏపీలో 11 కమిషన్లు ఏర్పాటయ్యాయి.
1969లో తొలి వేతన సవరణ సంఘం ఏర్పడింది. వేతన సవరణ పేరిట కరవు భత్యం పే స్కేలులో కలుపుతూ తదనుగుణంగా స్కేళ్లు మారుస్తూ, ఇతర డిమాండ్ల పైనా కమిషన్లు సిఫార్సులు చేస్తున్నాయి. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలనేది సూత్రం. ప్రస్తుతం ఆలస్యమవుతున్నట్లే వివిధ కారణాల వల్ల వేతన సవరణ సంఘాల ఏర్పాటు , నివేదికల అమలు వంటి వాటిలో ఆలస్యం వల్ల ఈ అయిదేళ్ల కాలపరిమితి మారుతూ వస్తోంది. ఒక్కోసారి 8 నుంచి 9 ఏళ్ల ఆలస్యం అయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా ఆలస్యాల వల్ల ఇంతవరకు రెండు పీఆర్సీలు కోల్పోయామని ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు.
పదవీవిరమణ అనంతర ప్రయోజనాలకు నష్టం పీఆర్సీ ఆలస్యం కారణంగా అధిక శాతం ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రయోజనం పొందలేక పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు పదో పీఆర్సీ 2013 జులై ఒకటి నుంచి అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి అమలు చేసింది. 2013 జులై ఒకటి నుంచి 2014 మే 30 వరకు 11 నెలల కాలంలో పదవీవిరమణ చేసిన వారికి పీఆర్సీ అమలు కాలేదు. వారందరికీ 2014 జూన్ రెండు నుంచి ఆర్థిక ప్రయోజనం అమల్లోకి వచ్చింది. ఇలా ప్రతి పీఆర్సీ సమయంలోను పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలుగుతోంది. 2018 నుంచి అమలు కావాల్సిన 11వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.
ఇప్పటి వరకు వేతన సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది
1వ పి.ఆర్.సి1969
అమలు తేది : 19.3.1969
ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
నష్టపోయిన కాలం : 12 నెలలు
2వ పి.ఆర్.సి 1974
అమలు తేది: 1.1.1974
ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
నష్టపోయిన కాలం : 16 నెలలు
3వ.పి.ఆర్.సి. 1978:
అమలు తేది: 1.4.1978
ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
నష్టపోయిన కాలం : 11 నెలలు
4వ.పిఆర్.సి 1982 రీగ్రూపు స్కేల్స్
అమలు తేది : 1.12.1982
ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి
5వ పి.ఆర్.సి. 1986:
అమలు తేది : 1.7.1986
ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
ఫిట్ మెంట్ ప్రయోజనం : 10శాత
6వ. పి.ఆర్.సి.1993:
అమలు తేది: 1.7.1992
ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
నష్టపోయిన కాలం : 21 నెలలు
ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం
7వ. పి.ఆర్.సి. 1999
అమలు తేది: 1.7.1998
ఆర్థిక లాభం : 1.4.1999
నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
నష్టపోయిన కాలం: 9 నెలలు
ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం
8వ. పి.ఆర్.సి 2005
అమలు తేది: 1.7.2003
ఆర్థిక లాభం: 1.4.2005
నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
నష్టపోయిన కాలం: 21 నెలలు
ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం
9వ.పి.ఆర్.సి. 2010
అమలు తేది: 1.7.2008
ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
నష్టపోయిన కాలం: 19 నెలలు
ఫిట్మెంట్: 39 %
EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని ఉద్యోగుల ఆరోగ్య కార్డులు)
10వ. పి.ఆర్.సి 2015:
అమలు తేది : 1.7.2013
ఆర్థిక లాభం: 2.6.2014
నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %
వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు
11వ.పి.ఆర్.సి. 2020:
కమిటీ ఏర్పాటు : 28.5.2018
గడచిన కాలం : 2సం.2నెలలు
ప్రస్తుత పరిస్థితి- నివేదిక రావాల్సి ఉంది. మళ్లీ కమిషన్ గడువు పెంపు.
No comments:
Post a Comment