ప్రభుత్వ పాఠశాలల్లో 'లిప్’
తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో భాషాభివృద్ధి కార్యక్రమాన్ని(లిప్) ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 10 నుంచి అమలు చేయనున్నారు. కాకినాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ)మధుసూదన్ దీన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100రోజులపాటు విద్యార్థులకు ఆయా తరగతుల వారీగా రోజుకు కొన్ని పదాలను తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నేర్పిస్తారు. 1, 2 తరగతులకు రోజుకు రెండు, 3-5వారికి మూడు పదాలను తెలుగు, ఆంగ్లంలో పరిచయం చేస్తారు. 6-10 తరగతుల విద్యార్థులకు రోజుకు ఐదు పదాల చొప్పున మూడు భాషల్లో నేర్పిస్తారు. తరగతిలో పాఠం ప్రారంభించే ముందు ఆయా మాధ్యమాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పదాలను నేర్పిస్తారు. ఇందుకోసం విద్యార్థులతో ప్రత్యేక నోట్‌బుక్ ఏర్పాటు చేయించి, ముందు రోజు నేర్పిన పదాలను తరగతిలో పునశ్చరణ చేయిస్తారు. విద్యార్థులు మూడు భాషలను నేర్చుకునేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు ఆర్జేడీ మధుసూదన్ తెలిపారు. అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు ఉపాధ్యాయులు ప్రతి 15రోజులకోసారి పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తామని, పాఠశాలలకు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తామని తెలిపారు.
No comments:
Post a Comment