Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

PRC 2022 NEWS ఉద్యోగ సంఘాలతో చర్చలు

  •  ఐఆర్‌ రికవరీ ఉండదు
  • ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ
  • ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ హామీ
  • అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చలు
  • హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ తదితర అంశాలపై రాని స్పష్టత
  • మంత్రుల కమిటీ నుంచి కొన్ని ప్రతిపాదనలు
  • డిమాండ్లను పునరుద్ఘాటించిన ఉద్యోగ సంఘాలు
  • నేడు మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయం
  • అనంతరం అవసరమైతే సీఎంతోనూ సమావేశం

 పీఆర్‌సీ సాధన సమితి నాయకులకు, మంత్రుల కమిటీకి మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి. ఐఆర్‌ రికవరీ చేయబోమని, పీఆర్‌సీని ఐదేళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ కొనసాగింపు, ఫిట్‌మెంట్‌ పెంచడం, సీపీఎస్‌ రద్దు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినా... మంత్రుల కమిటీ నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లపై ఉద్యోగుల డిమాండ్‌లు, వాటిని నెరవేరిస్తే ప్రభుత్వంపై పడే భారం వంటి అంశాలపై శనివారం 10 గంటలకు మంత్రుల కమిటీ, ఆర్థికశాఖ అధికారులు భేటీ కానున్నారు. అనంతరం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ మరోసారి సమావేశమవనుంది. అవసరమైతే ఆ సమావేశం అనంతరం.... ముఖ్యమంత్రి జగన్‌తోనూ ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) శ్లాబ్‌లలో మార్పులు, పింఛనుదారులకు అదనపు క్వాంటం పింఛను వంటి అంశాలపై కొన్ని ప్రతిపాదనల్ని ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచినట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, శనివారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. చాలా అంశాలపై ఇంకా స్పష్టత రానందున, చర్చలు ఇంకా కొనసాగుతున్నందున... శనివారం తాము ముందే ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలతో హుటాహుటిన కదిలిన మంత్రులు

చలో విజయవాడకు వేల సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడం, నిరసన విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణకు ఉద్యోగసంఘాలు నడుంకట్టాయి. పీఆర్సీ సాధన సమితి నాయకులు శుక్రవారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ముందే నిర్ణయించుకున్నట్టుగా పోరాటం ఉద్ధృతం చేయాలని, శనివారం నుంచి పెన్‌డౌన్‌, యాప్‌డౌన్‌ చేయాలని, ఆరోతేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. శనివారం సెలవు కావడంతో... రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు శుక్రవారమే పెన్‌డౌన్‌ చేసి, కంప్యూటర్లు కట్టేశారు. దీంతో.. వారితో మరోసారి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్‌ శుక్రవారం మధ్యాహ్నం డీజీపీతో సమావేశమయ్యారు. చలో విజయవాడపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం. అనంతరం.. ఉద్యోగులతో మొదటి నుంచీ చర్చిస్తున్న మంత్రుల కమిటీతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) శ్లాబుల వంటి అంశాల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నివారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యోగసంఘాల నాయకుల్ని చర్చలకు పిలవాలని, ప్రభుత్వ ప్రతిపాదనల్ని వారికి తెలియజేసి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని మంత్రుల కమిటీని సీఎం ఆదేశించారు. దాంతో సాయంత్రం 6.30 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌లో చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితి నాయకులకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సందేశాలు పంపించారు. మంత్రులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులంతా చేరుకున్నారు. మొదట వారితో సీఎస్‌ సమీర్‌శర్మ కాసేపు చర్చించారు. తమ డిమాండ్లేంటో ఇప్పటికే స్పష్టం చేశామని, వాటిపై నిర్దిష్టమైన హామీ లభిస్తేనే చర్చలకు వస్తామని నాయకులు పేర్కొన్నారు. మంత్రుల కమిటీ కొన్ని ప్రతిపాదనలతో వచ్చిందని చెప్పి, వారిని చర్చలకు ఒప్పించారు. సమావేశంలో పీఆర్సీ సాధన సమితి నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మట్టి ఖర్చులకు రూ. 25వేలు

కీలకమైన హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల అంశంలో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్టు తెలిసింది. తెలంగాణ తరహాలో హెచ్‌ఆర్‌ఏ విధానం చర్చలకు వచ్చినట్టు సమాచారం. చనిపోయిన ఉద్యోగులకు మట్టి ఖర్చులు కింద రూ.25 వేలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది.

మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు

  •  పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి.
  • 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి.
  •  కనీసం 27%కు తగ్గకుండా ఇవ్వాలి.
  • హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు పాతవే కొనసాగించాలి.
  •  సీసీఏ కొనసాగించాలి.
  • పింఛనర్లకు 70 ఏళ్లు దాటాక 10%, 75 ఏళ్లు దాటాక 15% అదనపు క్వాంటం వర్తింపజేయాలి.
  •  కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకారం పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
  • పొరుగు సేవల ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేల్‌ ఇవ్వాలి.
  • గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు నుంచి రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వాలి. 2022 పీఆర్సీ స్కేలు అమలుచేయాలి.

➤మార్చి 31 లోగా సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవాలి.

 ➤కేంద్ర పీఆర్సీ మాకు సమ్మతం కాదు. రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలి.

➤ఉద్యోగుల అసంతృప్తి చాలా వరకు తొలగిపోయింది: సజ్జల

‘‘సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. చర్చల ద్వారా వారి అసంతృప్తి చాలా వరకు తొలగిపోయింది. శనివారం మళ్లీ సమావేశమవుతాం. ఐఆర్‌ సర్దుబాటు చేయబోమని చెప్పాం. ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ వేస్తాం.

చాలా వరకు సానుకూలత తీసుకొచ్చాం: బొత్స

‘‘ప్రస్తుత చర్చల్లో చాలా వరకు సానుకూలత తీసుకువచ్చాం. శనివారం పరిష్కారం అవుతుందని మేం ఆశాజనకంగా ఉన్నాం. సహాయ నిరాకరణ విరమించుకోమని కోరాం’’

➤చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఉద్యమ కార్యాచరణ* కొనసాగుతుంది: బండి శ్రీనివాసరావు

‘‘చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సామాన్య ఉద్యోగికి అన్యాయం జరగకుండా చర్చలు జరిపాం. నష్ట నివారణను నియంత్రించేందుకు ప్రయత్నిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది. చర్చలు జరుగుతున్నందున ఉద్యమకార్యాచరణ కొనసాగుతుంది’’



No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND