Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

రాజధాని పై జి. ఎన్ రావు నివేదిక

3 రాజధానులు.. 4 కమిషనరేట్లు
➧అమరావతి, విశాఖలలో హైకోర్టు బెంచిలు
➧ఆంధ్రప్రదేశ్‌ శాసన రాజధానిగా అమరావతి
➧కార్యనిర్వాహక రాజధాని విశాఖ
➧న్యాయ రాజధానిగా కర్నూలు
➧విశాఖలో వేసవికాల అసెంబ్లీ సమావేశాలు
➧ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక
➧ఏపీ సీఎం జగన్‌కు అందించిన జీఎన్‌ రావు
లెజిస్లేటివ్‌ (శాసన) రాజధానిగా అమరావతిలో అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్‌ (కార్యనిర్వాహక) రాజధానిగా విశాఖపట్నంలో సచివాలయం, జ్యుడిషియల్‌ (న్యాయ) రాజధానిగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ నివేదిక సిఫారసు చేసింది. వాటితోపాటు.. విశాఖలో శాసనసభ వేసవికాల సమావేశాలు నిర్వహించాలని, అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచి ఉండాలంది. అమరావతిలోనూ హైకోర్టు బెంచి ఏర్పాటుచేయాలని సూచించింది.
ప్రాంతీయ కమిషనరేట్లు
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలి.
కర్ణాటక తరహాలో ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటుచేసి అక్కడినుంచి పాలన సాగించాలి.
కమిషనరేట్లు ఇక్కడ...
ఉత్తర కోస్తా: శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం
మధ్య కోస్తా: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
రాయలసీమ: కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు
రాజధానుల స్వరూపం..
విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌
ఇక్కడ సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచితో పాటు వేసవికాల సమావేశాల కోసం అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలి.
అమరావతి-మంగళగిరి కాంప్లెక్సు
చట్టసభలు, హైకోర్టు బెంచి, గవర్నర్‌, మంత్రుల బంగ్లాలు ఉంటాయి. మంగళగిరి,  నాగార్జున విశ్వవిద్యాలయం, ఏపీఎస్పీ బెటాలియన్‌ భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. కొత్తగా భూమి సేకరించాల్సిన అవసరం లేదు.
కర్నూలు : శ్రీబాగ్‌ ఒప్పందంతో పాటు ప్రజల ఆకాంక్ష మేరకు కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలి.
 ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధిపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై తుది నివేదిక సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి కన్వీనర్‌ జీఎన్‌ రావు సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రాజధానుల ఏర్పాటు... రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ నివేదికలో పలు సిఫారసులు చేసినట్లు చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఈ నెల 27వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీనిలో కమిటీ నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది.
వివిధ ప్రాంతాల అభివృద్ధి ఇలా..
తుళ్లూరు ప్రాంతంలో రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు ఖర్చుచేసిన అంశాన్ని కమిటీ ప్రస్తావించింది. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిస్థాయిలో నిర్మించి.. వాటిని శాఖాపరంగా ఉపయోగించుకోవాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అవి కాకుండా మిగిలిన ప్రాంతాలను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా 900 కిలోమీటర్ల పొడవున పట్టణీకరణ పెంపొందించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది.
 నదీ పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని, గోదావరి, నాగావళి, మహేంద్రతనయ, కృష్ణా నదుల ద్వారా నీటిపారుదల అవకాశాలు పెంపొందించాలని సిఫారసు చేసింది.
 విద్యుత్తు సరఫరా సమస్యలు తలెత్తకుండా సౌర విద్యుత్తుకు ప్రాధాన్యమివ్వాలని, దీన్ని ప్రభుత్వమే పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని సూచించింది.
రాజధాని రైతులతో మాట్లాడాం
రాజధాని ప్రాంతంలోని రాయపూడి, కృష్ణాయపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 2వేల మంది రైతులతో తాము మాట్లాడినట్లు కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు చెప్పారు. తాను గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. తమకు ఇవ్వాల్సిన భూమిని అభివృద్ధి చేసి ఇవ్వాలని వారు కోరారన్నారు. దీనికి అనుగుణంగా భూముల్ని అభివృద్ధి చేసి.. మౌలిక సౌకర్యాలు కల్పించి ఇవ్వాలని తాము ప్రభుత్వానికి సూచించామని చెప్పారు. అమరావతిలో వేలాది ఎకరాల భూముల్ని ఏం చేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. 165 సంస్థలకు భూములు ఇచ్చారని తెలిపారు. మిగిలిన భూముల్ని ఏంచేస్తారనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. రాష్ట్రంలో 4 ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు సిఫారసు చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఏదని ఓ విలేకరి అడగ్గా.. అది తమ పని కాదని జీఎన్‌ రావు చెప్పారు. నివేదికలోని సిఫారసు అమలుకు కాలపరిమితిపై ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరుగుతాయన్నారు.
అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి: కె.టి.రవీంద్రన్‌
‘‘శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోనూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలన్నారు. మా నివేదికలో దీనికే ప్రాధాన్యం ఇచ్చాం. రాజధాని ఏర్పాటు అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్లో ఆదాయ వృద్ధి జరగాలి’’ అని కమిటీ సభ్యుడు కేటీ రవీంద్రన్‌ తెలిపారు.
ప్రాంతీయ పట్టణాభివృద్ధి ప్రణాళిక అవసరం
‘‘పట్టణ, ప్రణాళిక చట్టం 1920లో ఏర్పడింది. దీన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. బోర్డుల ఏర్పాట్లు జరుగుతున్నాయి గానీ.. చట్టంలో మార్పులు చేయలేదు. ప్రాంతీయాభివృద్ధికి తగ్గట్లు చట్టంలో మార్పులు చేయాలి. ప్రాంతీయ పట్టణాభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవల్సిన అవసరం ఉంది’’ అని కమిటీ సభ్యుడు అరుణాచలం పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో సేకరించిన ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా తమ కమిటీ నివేదిక ఉందని మరో సభ్యుడు సుబ్బారావు వివరించారు. విలేకర్ల సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ అంజలీమోహన్‌, మహావీర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయకల్లం పాల్గొన్నారు.
10,600 కిలోమీటర్ల ప్రయాణం.. 38 వేల వినతులు
రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి? రాజధాని ఎలా ఉండాలి? అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలి? తదితర అంశాలపై తమ కమిటీ ఏర్పాటైందని కన్వీనర్‌ జీఎన్‌ రావు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,600 కిలోమీటర్లు తిరిగి అధికారులు, విలేకరులు, ప్రజాప్రతినిధులను కలిశామని తెలిపారు. పలు అంశాలపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 38 వేల వినతులు అందాయని చెప్పారు. ఆన్‌లైన్‌లోనూ వినతులు స్వీకరించినట్లు తెలిపారు. 120 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక అందించామని చెప్పారు. ‘‘వివిధ జిల్లాలకు వెళ్లి.. ప్రజల ఆకాంక్షలపై వారి అభిప్రాయాలు సేకరించాం. *మా సిఫారసుల్లో..* ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చాం. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా వికేంద్రీకరణ ఎలా చేయాలనే అంశాలు పరిశీలించాం’’ అని సభ్యులు చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేయాలని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ అభివృద్ధి చేయడం సరికాదని స్పష్టంచేశారు. ‘‘ఇచ్ఛాపురంలో ఉండే పేదవాడు తమ పని కోసం అమరావతి రావాలంటే కష్టం. అలా కాకుండా అక్కడే కమిషనరేట్‌ పెట్టి అక్కడే పరిష్కరించే విధానం ఉండాలి. పోలీసు, న్యాయపరమైన సేవలు ప్రజలకు దగ్గర్లో అందేలా వికేంద్రీకరించాలని చెప్పాం. మహారాష్ట్ర, శ్రీనగర్‌లో ఉన్నట్లుగా విశాఖపట్నం, అమరావతి నుంచి లెజిస్లేచర్‌ వ్యవస్థ పనిచేయవచ్చు. ప్రతి పనికీ రాజధానికి రావాల్సిన అవసరం ఉండదు..’’ అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND