సీఎఫ్‌ఎంఎస్‌లోనే ఇంకా కసరత్తు
పింఛన్లు మరింత ఆలస్యమేనా?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు శుక్రవారం సైతం జీతాలు, పింఛన్లు అందలేదు. కరోనా కారణంగా వారి వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున చెల్లింపులు మరింత ఆలస్యమవుతున్నాయి. తమ సిబ్బంది వేతనాల పూర్తి మొత్తానికి ఆయా కార్యాలయాల అధికారులు మార్చి 25లోపు బిల్లులు సమర్పించారు. జీతాలు, పింఛన్లలో కోత నిర్ణయాన్ని మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులన్నింటినీ సవరించి చెల్లించాల్సి వస్తుంది. శుక్రవారమే జీతాలను చెల్లిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఈ అంశం కొలిక్కి రాలేదు. మొత్తం జీతాల బిల్లులన్నీ తిరిగి డీడీవోలకు పంపి కొత్త ఉత్తర్వుల ప్రకారం కోత పెట్టి చెల్లించాలంటే దాదాపు 15 రోజులు ఆలస్యమవుతుంది. ఈ కారణంతో సీఎఫ్‌ఎంఎస్ కార్యాలయంలోనే సిద్ధం చేసిన ప్రోగ్రాం ఆధారంగా కోత విధిస్తున్నారు.
తాజా ఉత్తర్వులకు అనుగుణంగా కోత విధించిన మొత్తాలు సవ్యంగా ఉన్నాయా? లేదా? తెలియజేయాలంటూ సంబంధిత డీడీవోలకు ఖజానా కార్యాలయం వర్తమానం పంపింది. పరిశీలించిన డీడీవోలు ఎక్కువ మంది సవ్యంగానే ఉన్నాయని తిరుగు సమాచారం పంపినట్లు తెలిసింది. వాటిని తాజా నిర్ణయం ప్రకారం సరి చేసే పనిలో సీఎఫ్‌ఎంఎస్ సిబ్బంది నిమగ్నమయ్యారు. శుక్రవారం రాత్రికి కూడా ఆ పని పూర్తి కాలేదు. ఉద్యోగుల ఖాతాలకు వేతనాలు శనివారం జమవుతాయని ప్రస్తుత పరిస్థితిని బట్టి వారు చెబుతున్నారు. కొందరికి సోమవారం అందినా ఆశ్చర్యపోవలసింది లేదని సమాచారం. తొలుత ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేశాక పింఛన్లపై దృష్టి పెట్టనున్నారు. పింఛన్లలో రెండు రకాల కోత విధించాల్సి ఉంది. దీంతో సోమవారం వరకు పింఛన్లు అందేది అనుమానమే. ఖజానా శాఖ సంచాలకులు, సీఎఫ్‌ఎంఎస్ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయమే ఖజానా శాఖ జిల్లా అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఖజానా, పేఅండ్ అకౌంట్స్, లోకల్ ఆడిట్, ఆర్థిక శాఖ వంటి అయిదు శాఖల బిల్లులను తిరిగి సమర్పించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. వీరికి తప్ప మిగిలిన వారి వేతనాల చెల్లింపునకు సమస్యలు లేవన్నారు.
No comments:
Post a Comment