ఉపాధ్యాయ బదిలీ లలో సరికొత్త మెలికలు...
♦ప్రతి మండలంలో పది శాతం ఖాళీల రిజర్వుకు ఆదేశం
♦ఐడీ, పాస్‌వర్డ్ రానివారికి డీఈవో కార్యాలయం కేటాయింపు
♦ఉపాధ్యాయబదిలీ దరఖాస్తులకు నేటితోముగియనున్న గడువు
ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యాక పాఠశాల విద్యాశాఖ పలు నిర్ణయాలు తీసుకోవడంతో అంతిమంగా ఉపాధ్యాయులకు నష్టం జరగనుందనే అభిప్రాయాన్ని సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి మండలంలో కేటగిరి 1, 2, 3 పోస్టుల్లో పది శాతం ఖాళీలను రిజర్వు చేయాలని ఆదేశించడంతో వాటిపై ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఏవైతే బ్లాక్ చేస్తారో వాటిని ఖాళీల జాబితాలో చూపకూడదని జిల్లా విద్యా శాఖలను ఆదేశించింది. సోమవారంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనున్న వేళ ఈ సమాచారం జిల్లా విద్యాశాఖకు చేరింది. ఇప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులకు పాస్‌వర్డు, ఐడీలు రాక దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాటి కోసం ఎదురుచూస్తున్నారు. ఏ ఒక్కరికీ ఈ వివరాలు తెలియకూడదని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం ఎవరికైతే అవి అందలేదో ఆ ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల పేరు, డైస్ కోడ్, ట్రెజరీ ఐడీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్ల వివరాలను ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాశాఖకు తెలియజేస్తే ఇక్కడ అధికారులు వారికి సంబంధించిన ఐడీ, పాస్‌వర్డులు కేటాయిస్తామని చెప్పింది. ఇలా చేయడం వల్ల తమ ఐడీలు డీఈఓ కార్యాలయ ఉద్యోగులకు తెలిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఎంతో గోప్యత పాటించాల్సిన వీటి విషయంలో ఉపాధ్యాయులకు వాటిని నేరుగా కేటాయించకుండా డీఈఓ కార్యాలయం ద్వారా క్రియేట్ చేసి ఇవ్వడంపై కొన్ని సంఘాలు తప్పుబడుతున్నాయి. ఒకవైపు దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగియనుంది. ఇప్పటికీ డీఈఓ పూల్ కోటాలో ఉన్న ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలా లేదా? అదే విధంగా హేతుబద్ధీకరణ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులుగా గుర్తించిన వారి విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. వారిని బదిలీ చేస్తారా? ఇంకేదైనా పాఠశాలకు కేటాయిస్తారా అనేది తెలియజేయకపోవడంతో వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. వీటన్నింటికి పరిష్కారాలు ఇంకెప్పుడు చూపుతారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. గతంలో బదిలీలు జరిగినప్పుడు క్లియర్ వేకెన్సీలు, రేషనలైజేషన్ ఖాళీలు ఇలా ప్రతిదీ చూపి ఆమేరకు బదిలీలు కోరుకునే అవకాశం కల్పించేవారు. ఈసారి ప్రతి మండలంలో ఉన్న మొత్తం ఖాళీల్లో పది శాతం రిజర్వు చేసి ఆమేరకు బదిలీలు కోరుకోవడానికి అవకాశం కల్పించనుండటంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీల్లో మిగిలిపోయిన ఖాళీలను తిరిగి ఎలా నింపుతారనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఖాళీలను భర్తీ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యాక సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంతో తాము తిరిగి ప్రభుత్వంతో చర్చించే అవకాశం లేకుండా పోయిందని సంఘాల నేతలు అంటున్నారు.
♦పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు...
ఈ ఏడాది అక్టోబరులో పలువురు ఉపాధ్యాయులు పదోన్నతిపై ఆయా పాఠశాలలకు వెళ్లడానికి ఆసక్తి కనబరిచి ఆ మేరకు లేఖ ఇచ్చారు. అలాంటి వారు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోనవసరం లేదని యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. డిసెంబరు 3 నుంచి 5 వరకు వారు నేరుగా ఆన్‌లైన్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. డీఈఓ పూల్ కోటాలో ఉన్న ఉపాధ్యాయులు, హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు ఉపాధ్యాయులుగా ప్రకటించినవారు, గత బదిలీల్లో ట్రాన్స్‌ఫర్ మెసేజ్ రాని కారణంగా బదిలీ నిలిచిపోయినవారు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో సంప్రదిస్తే వారికి తగు సూచనలు, సలహాలిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
♦నాలుగో కేటగిరీ ఖాళీలు భర్తీ చేయటానికే ?
ప్రతి మండలంలో కేటగిరి 1, 2, 3లో ఉన్న పాఠశాలలు మాత్రమే బదిలీల్లో కోరుకుంటున్నారు. ఏ రకమైన రవాణా సౌకర్యం లేని సముద్ర తీర ప్రాంతాలు, కొండకోనల్లో ఉన్న పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఆ పాఠశాలల్లో యధావిధిగా ఏటా ఉపాధ్యాయుల కొరత తలెత్తుతోంది. దీన్ని నివారించడానికి ఉపాధ్యాయులు ఎక్కువగా ఇష్టపడే మొదటి మూడు కేటగిరీల్లోని పోస్టులను కొంత మేరకు బ్లాక్ చేస్తే కచ్చితంగా కొంతవరకైనా నాలుగో కేటగిరీల్లో ఉండే ఖాళీలను కోరుకుంటారు. తద్వారా ఆ పోస్టులు భర్తీ అవుతాయనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ప్రస్తుత బదిలీల్లో ఈ విధానం అనుసరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఖాళీలు ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉంటాయని, సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులపై ఇది బాగా ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయవర్గం చెబుతోంది. ఉన్నత పాఠశాలల్లో పిల్లల వర్క్‌లోడ్ ఎక్కువగా ఉండడంతో వీటిల్లో ప్రతి పోస్టు భర్తీ అవుతుంది. ఈ దృష్ట్యా ఉన్నత పాఠశాలల్లో ఈ సమస్య ఉండదు.
No comments:
Post a Comment