రెండు నెలల్లో బకాయిలు చెల్లించండి
వేతన, పింఛన్ల బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
ఉద్యోగులు, పింఛనర్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో నిలిపివేసిన 50 శాతం వేతనాలు, పింఛన్లను రెండు నెలల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ విశ్రాంత న్యాయమూర్తి డి.లక్ష్మీ కామేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు నిలిపివేసిన 50 శాతం వేతనాలు, పింఛన్లను 12 శాతం వడ్డీతో రెండు నెలల్లో చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందూ బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది శివసంతోష్ కుమార్ వాదనలు వినిపించారు. విచారించిన ధర్మాసనం ఒక నెల బకాయిలను డిసెంబరు 15 లోపు, రెండో నెల బకాయిలను జనవరి 15లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బ తిన్నందున వడ్డీని చెల్లించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది శేఖర్ నాఫడే ధర్మాసనానికి విన్నవించారు. వడ్డీ చెల్లింపుపై ధర్మాసనం స్టే ఇచ్చింది. కేసు తదుపరి విచారణను జనవరి మూడో వారానికి వాయిదా వేసింది.
No comments:
Post a Comment