అమ్మఒడి ఫస్ట్.. ఆ తరువాతే టీచర్ల బదిలీలు
ఒకేసారి రెండు పనులతో విద్యా శాఖ ఉక్కిరిబిక్కిరి
ఒత్తిడికి లోనవుతున్న అధికారులు
అమ్మఒడికి తొలిప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
తొమ్మిదో తేదీ తరువాత ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్
అమ్మఒడి పథకం కింద రెండో విడత సాయం పంపిణీ పూర్తయిన తరువాతే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టాలని విద్యా శాఖ యోచిస్తున్నది. వచ్చే నెల తొమ్మిదో తేదీన అమ్మఒడి సాయం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నది. అప్పటి వరకు టీచర్ల బదిలీలను పక్కనపెట్టారనే వాదన ఉపాధ్యాయ వర్గాల్లో వినిపిస్తున్నది. అమ్మఒడి సాయం కోసం అనర్హత, విత్‌హెల్డ్ జాబితాలో ఉన్న వారిలో అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని షెడ్యూల్ ఇచ్చారు. ఇదే సమయంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు ఇచ్చి, ఈ నెలాఖరులోగా మార్పులకు అవకాశం ఇచ్చారు. రెండు కార్యక్రమాలు ఒకేసారి పూర్తిచేయడంలో విద్యా శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో అమ్మఒడికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించిందని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. బదిలీలకు సంబంధించి ఆప్షన్ల నమోదు ఈ ప్రక్రియ నెలాఖరు ముగిసినా... అమ్మఒడి సాయం పంపిణీ తరువాతే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
అమ్మఒడి సాయం పంపిణీ తరువాతే కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి అని వ్రాసారు. వెబ్ కౌన్సెలింగ్ కదా ? ఇంకా కౌన్సిలింగ్ నిర్వహించేది ఏముంది మిత్రమా ! ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోవడమే
ReplyDelete