ఉన్నత విద్యలో 4 కొత్త కోర్సులు
ఈ ఏడాది నుంచి అమలు
247 కళాశాలలకు షోకాజ్ నోటీసులు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యలో నాలుగు కొత్త కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉన్నత విద్యను మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత విద్య ప్రణాళికామండలి (హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు)తో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర, సెంట్రల్ వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు పరస్పర భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి.. పదినెలల ఇంటర్న్‌షిప్‌తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పీజీ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో చేరి మూడేళ్లు మాత్రమే చదువుతానంటే డిగ్రీ లభిస్తుందని చెప్పారు.
నూతన విద్యావిధానంలో 70 శాతం చేరికలు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరికలు 90 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆధునికీకరిస్తున్నామన్నారు. నైపుణ్యాల కల్పన పెంపు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశోధనల పెంపు లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ, నేషనల్ రీసెర్చి డెవలప్‌మెంటు కార్పొరేషన్ తదితర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఒక విభాగం ఏర్పాటుచేసి తొలిసారి అకడమిక్ ఆడిట్ చేపట్టామన్నారు. ఎనిమిది విశ్వవిద్యాలయాలను మల్టీ డిసిప్లిన్ ఎడ్యుకేషన్ రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామన్నారు. తొలివిడతలో శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, జేఎన్‌టీయుకే, జేఎన్‌టీయుఏ, ఆర్జీయూకేటీలను, తదుపరి దశలో నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, పద్మావతి వర్సిటీలను రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామని వివరించారు. నాలుగు వర్సిటీలను ప్రతిపాదించగా కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ, కర్నూలులో క్లస్టర్ వర్సిటీ ఏర్పాటు చేశామని, టీచర్ ట్రయినింగ్ ప్రాధాన్యతతో ప్రకాశం వర్సిటీని తీర్చిదిద్దనున్నామని, అలాగే విజయనగరంలో వర్సిటీ ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
No comments:
Post a Comment