- ప్రభుత్వోద్యోగి అదృశ్యమైతే....
- ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకమా ?
- పైగా ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలా ?
- అదేమి నిబంధనంటూ హైకోర్టు ఆక్షేపణ
- సంబంధిత జీవో కొట్టివేత
మృతి చెందిన, అదృశ్యమైన ప్రభుత్వోద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామక నిబంధనల్లో వివక్ష తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగి కనిపించలేదని ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఆ ఉద్యోగికి ఏడేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉంటేనే కుటుంబసభ్యులు కారుణ్య నియామకానికి అర్హులవుతారన్న నిబంధన వివక్షాపూరితమని తప్పుపట్టింది. 1999 ఆగస్టు 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 378లోని సంబంధిత నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ దాన్ని కొట్టేసింది. ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకు వెంటనే కారుణ్య నియామకంతోపాటు అన్ని ప్రయోజనాలు అందిస్తున్నారని.. కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో వీటి కోసం ఏడేళ్ల వరకు వేచి చూడాల్సి రావడం సరికాదని పేర్కొంది. తగిన పోస్టులో కారుణ్య నియామకం కింద పిటిషనర్ శ్రీనివాసరావును నియమించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్లాంట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న టి.సుబ్బారావు 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి, 2001 డిసెంబర్ 31న ‘ఆచూకీ లభ్యం కాలేదు’ (అన్‌డిటెక్టబుల్) అని తుది నివేదిక ఇచ్చారు. ఆ విషయాన్ని 2002 అక్టోబర్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రానికి తెలిపారు. ఆ తర్వాత తన తండ్రి అదృశ్యమై ఏడేళ్లు పూర్తయినందున కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని శ్రీనివాసరావు విద్యుత్ అధికారులకు దరఖాస్తు చేశారు. పిటిషనర్ తండ్రి అదృశ్యమైనట్లు ఎఫ్‌ఐఆర్ నమోదయినప్పటి నుంచి ఆయనకు ఏడేళ్లకు పైగా సర్వీసు లేదన్న కారణంతో కారుణ్య అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. దీనిపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలన్న నిబంధనను కొట్టేయాలని కోరారు.
ఆ షరతులు పథకం ఉద్దేశాన్ని నీరుగార్చేవే
‘అదృశ్యం కేసుల విషయంలో ఉద్యోగి కనిపించకుండా పోయిన ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకానికి విజ్ఞప్తి చేయాలని జీవోలోని నిబంధన చెబుతోంది. మరోవైపు అదృశ్యమైనట్లు ఎఫ్‌ఐఆర్ నమోదయినప్పటి నుంచి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని పేర్కొంటోంది. ఈ షరతులు కారుణ్య నియామక పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నాయి. అదృశ్యమైన ఉద్యోగి.. మరణించారని ఏడేళ్ల తర్వాత ప్రకటిస్తేనే కారుణ్య నియామకానికి కుటుంబసభ్యులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈలోపు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి కుటుంబాల దయనీయ స్థితిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుందని విశ్వసిస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.
No comments:
Post a Comment