- కరోనా టీకా రెండోడోసు ఎందుకు తీసుకోవాలంటే ?
- ప్రజలకు వివరించిన కేంద్రం
దిల్లీ: కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకున్న ప్రపంచానికి ఇప్పుడు టీకానే తారకమంత్రం. దీన్ని అర్హులందరికీ వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో టీకాపై ప్రచారంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసింది. కరోనా కట్టడికి ఒకడోసు మాత్రమే సరిపోదని.. రెండో డోసు కూడా అవసరమంటూ వివరించిన వీడియోను శుక్రవారం విడుదల చేసింది. దాంట్లో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సందేహాలకు సమాధానమిచ్చారు.
➤‘కరోనా మొదటి డోసును ప్రైమ్ డోసు అంటారు. ఇది ప్రతిరోధకాల కోసం రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుంది. మొదటి దశలో ప్రతిరోధకాలు విడుదలైననూ.. అవి ఎక్కువ కాలం ఉండవు. కాలంతో పాటు క్షీణిస్తాయి. బూస్టర్ డోసుగా చెప్పే రెండో డోసుతో భారీగా ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయి. దాంతో కరోనా వైరస్‌ను కట్టడి చేసే బలమైన రక్షణ లభిస్తుంది. అలాగే మెమొరీ కణాలు కూడా ప్రేరేపితమవుతాయి. దాంతో వైరస్‌ను శరీరం దీర్ఘకాలం గుర్తుంచుకునే వీలుంటుంది. భవిష్యత్తులో మరోసారి వైరస్ బారిన పడినా.. త్వరిత గతిన ప్రతిరోధకాలు విడుదలవుతాయి’ అని గులేరియా వివరించారు.
➤28 రోజుల వ్యవధిలో కరోనా టీకా రెండు డోసులను విధిగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు తెలియజేస్తున్నాయి. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తరవాత రక్షిత స్థాయిలో ప్రతిరోధకాలు విడుదలవుతాయని నిపుణులు చెప్తున్నారు. రెండో డోసును నిర్ణయించిన వ్యవధిలో తీసుకోవాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మార్గదర్శకాలు చెప్తున్నాయి. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే మొదటి డోసు తీసుకున్న ఆరు వారాల్లో రెండోది వేయించుకోవాలి. అంతకంటే ఆలస్యం అయితే రోగనిరోధక స్పందన ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.
➤దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజు కూడా రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,185 మంది మృతి చెందారు. కేసుల పరంగా అమెరికా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది. కాగా, ప్రస్తుతం కేంద్రం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందిస్తోంది. ఇప్పటి వరకు 11.7 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసింది. కేవలం 1.48 కోట్ల మందికి రెండు డోసుల టీకాను అందించగా, 8.73 కోట్ల మందికి ఒక డోసు వేసినట్లు తెలిపింది
No comments:
Post a Comment