గురువుల యాప్ సోపాలు
➤కరోనా ప్రభావంతో గతేడాది నుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పరీక్షలు లేకపోవటం, అకడమిక్ క్యాలెండరులో మార్పులు, చేర్పులు వంటివి అనేకం చోటుచేసుకున్నాయి. రోజు విడిచి రోజు బడి నుంచి ఇప్పుడిప్పుడే క్రమంగా పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సమాచార సేకరణ పేరిట వివిధ రకాల యాప్‌ల్లో వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. అంతర్జాలం పని చేయకపోతే ట్యాబ్‌లతో కుస్తీ పట్టడమే. పాఠశాలల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి విద్యాశాఖ రూపొందించిన యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరిచేందుకే సమయం సరిపోతుంది.
➤కరోనా ప్రభావంతో విద్యారంగంలో సాంకేతిక వినియోగం కొత్త పుంతలు తొక్కింది. ఉపాధ్యాయులు, విద్యార్థులంతా సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ వినియోగం మితిమీరి అసలు లక్ష్యం, ఉద్దేశం దెబ్బతినే స్థాయికి చేరింది. ప్రస్తుతం విద్యావ్యవస్థలో అదే జరుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గురువుల అసలు విధి అయిన బోధనను మరిచిపోయి.. యాప్‌ల్లో సమాచారం అప్‌లోడు చేయడంలోనే బోధన సమయమంతా హరించిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో యాప్‌లో సమాచారం అప్‌లోడు చేస్తూనే ఉంటున్నామ న్నది వారి ఆవేదన. సమయానికి వివరాలు అప్‌డేట్ చేయకపోయినా, వివిధ కారణాల వల్ల సర్వర్ మొరాయించినా ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని సంఘాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించాయి.
తప్పని అవస్థలు
యాప్‌ల్లో సమాచారం నమోదులో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులూ అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వందలాది ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ విద్యాలయాలుగా మారిపోయాయి. వాటిలోని బోధనా సమయమంతా ఫొటోలు, సమాచారం అప్‌లోడ్ చేయడానికే సరిపోతుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కనీసం ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులను ఈ పనులకే కేటాయిస్తున్నారు. బోధించాల్సిన సమయాన్ని బోధనేతర కార్యక్రమాలకు కేటాయించడంతో సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితి వస్తోంది. దీనివల్ల ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది.
ఒకటా.. రెండా..
విద్యార్థుల హాజరు, జగనన్న విద్యాదీవెన పేరుతో పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, దుస్తులు, నోట్ పుస్తకాల పంపిణీ, అమ్మ ఒడి, రేషన్ పంపిణీ, పాదాల కొలతల నమోదు, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు-నేడు, బడికి పోదాం, జగనన్న విద్యాకానుక, దీక్ష, నిష్ఠ, స్కూల్ ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం, ఉపాధ్యాయుల సెలవులు, హాజరు, ఇన్‌స్పైర్ మనక్, ఛైల్డ్ ఇన్‌ఫో వంటి యాప్‌లతో పాటు మరుగుదొడ్ల పరిశీలనకు ఎస్‌ఎంసీ కమిటీ ఛైర్మన్ లాగిన్‌తో గూగుల్ లింక్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. తాజాగా వంట ప్రదేశం, పాత్రలు, స్టోర్‌రూం, వండిన గుడ్లు, టీఎస్‌ఎం పేరుతో విద్యార్థులు వినియోగించే బాత్‌రూమ్‌ల ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాలంటూ మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టారు.
No comments:
Post a Comment