కొవిడ్ వ్యాప్తి తగ్గగానే పది, ఇంటర్ పరీక్షలు.
విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి
కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వెంటనే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన డా.బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ, వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు పినిపే విశ్వరూప్, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కన్నబాబు, ఎంపీ వంగా గీతతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది పది పరీక్షల రద్దు వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తాయని, పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే పది, ఇంటర్ మార్కులు కీలకమన్నారు. ఈ దఫా తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని.. పరిస్థితులు అనుకూలిస్తే జులైలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలు దేశ వ్యాప్తంగా అందించే ఎన్‌ఆర్‌ఐ ర్యాంకులో మొదటి పది స్థానాల్లో ఉండాలన్నారు. జేఎన్టీయూ విజయనగరం, ఆంధ్రా కేసరి ఒంగోలు వర్సిటీలకు చట్టాలు చేసి గుర్తింపునిస్తామన్నారు. ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జేఎన్టీయూకే ఇన్‌ఛార్జి ఉపకులపతి సతీష్ చంద్ర, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రెక్టార్ ప్రసాదరాజు, రిజిస్ట్రార్ సీహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment