భారత్‌లో బడులు తెరిచేదెప్పుడు ?
దిల్లీ:కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నిర్వహణ వాయిదా పడింది.ఈ నేపథ్యంలో తిరిగి బడులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. వీలైనంత ఎక్కువ మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే బడులు తెరవడం ఉత్తమమని అన్నారు. అంతేకాకుండా మూడో దశ వ్యాప్తిలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మరింత ఆచితూచి వ్యవహరించాలన్నారు. ‘‘ బడులు తెరిచే సమయం ఆసన్నమైంది. కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో విదేశాల్లోనూ పాఠశాలలు తెరిచేశారు. కానీ, ఒక్కసారిగా మళ్లీ విజృంభించేసరికి మూసేశారు. మన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అలాంటి పరిస్థితులు రాకూడదు.’’ అని దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీకే పాల్ వెల్లడించారు. ఈ మహమ్మారి వల్ల హాని ఉండబోదన్న భరోసా లభించినంత వరకు పాఠశాలలు తెరవకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఎయిమ్స్ ఇటీవల జరిపిన సర్వేలో 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలోనూ కరోనా వైరస్ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. ఒక వేళ మూడోదశ వ్యాప్తి వచ్చినా చిన్నారులపై ఆ ప్రభావం ఉండకపోవచ్చని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వీకే పాల్ మాట్లాడుతూ..సర్వేలో తేలినంత మాత్రాన పాఠశాలలు తెరచుకోవచ్చని, పిల్లలు సామాజిక దూరం పాటించనవసరం లేదని సర్టిఫికెట్ ఇచ్చినట్లు కాదని అన్నారు. పాఠశాలలు తెరవాలా? వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ సర్వే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.
No comments:
Post a Comment