ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు కసరత్తు.
- ఫోన్లు, టీవీలు, రేడియో సౌకర్యాలున్నాయా..?
- విద్యార్థుల నుంచి వివరాలు సేకరించిన ఉపాధ్యాయులు.
- ఈసారీ ఆలస్యంగానే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం.
వాస్తవానికి ప్రతిసారీ జూన్ 12 నుంచి, అంటే రేపటి నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కావాలి. కానీ.. కరోనా రెండో దశ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత విద్యాసంవత్సరం ఆరంభంలో ఆరు నెలల పాటు పాఠశాలలు తెరచుకోలేదు. చివర మరో నెల రోజులు ముందుగానే మూతపడ్డాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా కొవిడ్ రెండో దశ కొనసాగుతుండడంతో బడిగంటలు ఎప్పుడు మోగుతాయో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలు బోధించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. అందులో భాగంగా విద్యార్థుల దగ్గరున్న ఉపకరణాలు ఏమిటో తెలుసుకోవడానికి సాంకేతిక సర్వే చేపడుతోంది. జిల్లాలోని అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలలు 4900 ఉన్నాయి. వీటిలో 1 నుంచి 10వ తరగతి వరకు 3.46 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఉపాధ్యాయులు ఫోన్లు చేసి వివరాలు సేకరించారు.కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలాఖరులో పాఠశాలలన్నీ మూత పడ్డాయి. ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు కొంతమేర ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్ బోధన లభించలేదు. శనివారం నుంచి మొదలుకానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సెల్‌ఫోన్, కంప్యూటర్, టీవీ, రేడియో వంటి మాధ్యమాల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆన్‌లైన్ పాఠాలకూ అవస్థలే.
సర్వే కోసం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఉపకరణాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు ‘ఫోన్లున్నా.. మీ పాఠాలు మొదలుపెట్టే సమయానికి మేము పట్టుకుని బయటికి పోతున్నాం. ఇంట్లో ఉండేది ఒకటే సెల్‌ఫోన్. మా వాడికి ఇస్తే మా సంగతేంటి? టీవీ ఉంది కానీ పాఠాలు వచ్చే దూరదర్శన్ ఛానల్ రావడం లేదు.’ అంటూ ఉపాధ్యాయులను తిరిగి ప్రశ్నిస్తున్నారు. ‘ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి ఫోన్ ఇస్తే మరొకరి సంగతేంటి? ఇద్దరు కొట్టుకుంటారు. రెండు ఫోన్లు కొని వాటికి ఇంటర్నెట్ వేయించే స్తోమత లేద’ని చాలా మంది చెబుతున్నారు. ‘గత ఏడాది కూడా ఇలాగే పాఠాలు చెప్పారు. మా వాడు ఆన్ చేసి వదిలేయడమే తప్ప.. మీరు చెప్పింది పుస్తకాల్లో రాసింది లేదు. ఏదైనా సందేహం ఉంటే తిరిగి అడిగే అవకాశం లేదు. అందుకే ఆన్‌లైన్ తరగతులంటే పెద్దగా ఆసక్తి ఉండడం లేద’ని తల్లిదండ్రులు బహిరంగంగా చెబుతున్నారు.
సేకరించే వివరాలు
విద్యార్థికి లేదా కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్ ఉందా.. ఉంటే రెండు గంటల పాటు ఆ ఫోను వాడుకునే పరిస్థితి ఉందా..? విద్యార్థి తల్లిదండ్రుల వద్ద ఫోను ఉందా..? ఇంటర్నెట్ సదుపాయం ఉందా..? విద్యార్థుల వద్ద ఎలాంటి ఫోన్లు లేవా..? బేసిక్ ఫోను మాత్రమే ఉందా..?ఫవిద్యార్థి విద్యావసరాలకు టీవీ వినియోగించుకునే అవకాశం ఉందా..? ఇంటిలో రేడియో అందుబాటులో ఉందా..? ఉంటే ఎఫ్‌ఎం రేడియోనా..? సాధారణ రేడియోనా..? పంచాయతీ, కమ్యునిటీ రేడియో వినియోగిస్తున్నారా..? వంటి విషయాలను తెలుసుకుని సంబంధిత యాప్‌లో నమోదు చేశారు.
No comments:
Post a Comment