ఆంధ్రప్రదేశ్ లో పీ ఆర్ సీ అమలు ఎప్పుడు ?
తెలంగాణ రాష్ర్టంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతన సవరణ పై జనవరి మూడో వారంలో ప్రకటన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సాధికారికంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దసరా కు ముందు రోజు కరవు భత్యం అమలుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏ డీఏ ఎప్పటి నుంచి వర్తింపజేయబోయేది అందులో ప్రస్తావించారు. ఆనక డీ ఏ ఉత్తర్వులు జారీ చేస్తూ మిగిలిన డీఏలకు సంబంధించిన ఉత్తర్వులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతకుమించి పీ ఆర్ సీ పై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరో వైపు శాసనమండలిలో ఉద్యోగుల అంశాలపై సాగిన చర్చలో పీఆర్సీ అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేశామని, ఆ కమిటీ పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనమండలిలో ప్రకటించారు. పీ ఆర్సీ అమలుపై అధ్యయనానికి కమిటీ వేస్తున్నట్టుగా ఎలాంటి ఉత్తర్వులు ఇంతవరకు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు.
మరో వైపు ఏపీ ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఉద్యోగులకు అమలు చేయాల్సిన అన్ని అంశాలపై ఏప్రిల్ లోపు పరిష్కరిస్తానని హామీ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల అంశాలపై ఆయా ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లోను, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని సార్లు చర్చలు జరపడం తప్ప ఇంతవరకు పీఆర్సీ పై అధికారికంగా నేరుగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. తెలంగాణ పీ ఆర్ సీ అమలుకు కార్యాచరణ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోను పీ ఆర్ సీ అమలుపై చర్చలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం పీ ఆర్ సీ పై ఒక సానుకూల అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని ఉద్యోగ లోకం కోరుకుంటోంది.
*ఉగాది వరకు ఆగాల్సిందేనా?*
ఏపీలో పీఆర్ సీ అమలు ప్రకటన కోసం ఉగాది వరకు ఆగాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది. ఏప్రిల్ 13న ఉగాది. అప్పటికి రాష్ర్ట బడ్జెట్ కూడా కొలిక్కి వస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ తయారీ సమయంలోనే కొత్త పీఆర్ సీ అమలుకు సంబంధించిన కేటాయింపులు కూడా చూపవలసిన అవసరం ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలకు ముందే పీ ఆర్ సీ అమలుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశమూ ఉందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి ప్రారంభంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి నెలాఖరు లోపు పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించవలసి ఉంటుంది. బడ్జెట్ కసరత్తు ఇంకా మొదలు కాలేదు.
No comments:
Post a Comment